April 8, 2017

Bhagavatgeeta 18th chapter meanings

Bhagavatgeeta 18th chapter meanings

అర్జునుడు చెప్పెను ( ప్రశ్నించెను )-

గొప్పభుజములు గలవాడవును , ఇంద్రియముల యొక్క నియామకుడవును , కేశ యను రాక్షసుని సంహరించినవాడవునగు ఓ కృష్ణా ! సన్న్యాసము యొక్కయు , త్యాగము యొక్కయు యథార్థమును తెలిసికొనగోరుచున్నాను . కావున ఆ రెండిటిని వేఱు వేఱుగా నాకు జెప్పుము .
2 & 3

శ్రీ భగవంతుడు చెప్పెను.
( ఓ అర్జునా ! ) కామ్యకర్మలను వదులుటయే సన్న్యాసమని కొందఱు పండితులు చెప్పుదురు . మఱికొందఱు పండితులు సమస్త కర్మములయొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని వచించుదురు . కొందఱు బుద్ధిమంతులు (సాంఖ్యులు ) దోషమువలె కర్మము విడిచిపెట్టదగినదని చెప్పుదురు . మఱికొందఱు యజ్ఞము, దానము, తపస్సు - మున్నగు కర్మములు విడువదగనివనియు చెప్పుదురు .
వ శ్లోకం  ........ భావం:--
భరతకులోత్తముడవును , పురుష శ్రేష్ఠుడవు నగు ఓ అర్జునా ! అట్టి కర్మత్యాగవిషయమున నాయొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము . త్యాగము మూడు విధములుగా చెప్పబడియున్నదిగదా !
5
యజ్ఞము , దానము , తపస్సు అనెడి కర్మములు త్యజింపదగినవి కావు ; చేయదగినవివే యగును . ఏలయనిన ఆ యజ్ఞ దాన తపంబులు బుద్ధిమంతులకు పవిత్రతను ( చిత్తశుద్ధిని ) గలుగ జేయునవై యున్నవి .
6 & 7

అర్జునా 1 ఈ యజ్ఞ దాన తపః కర్మలనుగూడ ఆసక్తిని , ఫలములను విడిచియే చేయవలెనని నాయొక్క నిశ్చితమగు ఉత్తమాభిప్రాయము . ( వేదశాస్త్రాదులచే ) విధింపబడినట్టి కర్మముయొక్క పరిత్యాగము యుక్తము కాదు . అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైన విడిచిపెట్టునేని అది తామసత్యాగమే యగునని చెప్పబడుచున్నది .8

ఎవడు శరీరప్రయాసవలని భయముచేత దుఃఖమును గలుగజేయునదియనియే తలంచి విధ్యుక్త కర్మమును విడిచిపెట్టునో , అట్టివాడు రాజసత్యాగమును గావించినవాడై త్యాగఫలమును బొందకయే యుండును .
9
ఇది చేయదగినదియే యని తలంచి శాస్త్రనియమితమగు ఏకర్మము , అభిమానము , ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి ( కర్మమందలి సంగఫల ) త్యాగము సాత్త్విక త్యాగమని నిశ్చయింపబడినది .
10
సత్త్వగుణముతో గూడినవాడును , ప్రజ్ఞాశాలియు , సంశయములను బోగొట్టుకొనినవాడును నగు త్యాగశీలుడు , అశుభముము , కామ్యమును దుఃఖకరమును నగు కర్మను ద్వేషింపడు ; శుభమును , నిష్కామమును , సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడుకాడు ( అభిమానము గలిగి యుండడు ) .
11

కర్మములను పూర్తిగా విడుచుటకు దేహధారియగు జీవునకు సాధ్యము కాదు . ఎవడు కర్మలయొక్క ఫలమును విడుచుచున్నాడో అట్టివాడే త్యాగియని పిలువబడుచున్నాడు .
12

దుఃఖకరమైనదియు , సుఖకరమైనదియు , సుఖదుఃఖములు రెండును గలసినదియునగు మూడువిధములైన కర్మఫలము కర్మఫలత్యాగము చేయనివారలకు మరణానంతరము కలుగుచున్నది . కర్మఫలత్యాగము చేసినవారికన్ననో అవి యెన్నటికిని కలుగ నేరవు .
13

గొప్పబాహువులుకల ఓ అర్జునా 1 సమస్త కర్మలు నెరవేఱుటకు కర్మకాండయొక్క అంతమును దెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నావలన తెలిసికొనుము .
14
ఈ కర్మచరణ విషయమున (1) శరీరము (2) కర్త (3) వివిధములగు ఇంద్రియములు (4) పలువిధములుగను , వేఱు వేఱుగను నుండు క్రియలు (వ్యాపారములు ) ఐదవదియగు (5) దైవమును కారణములుగా నున్నవి
15 & 16

మనుజుడు శరీరము , వాక్కు , మనస్సు అను వీనిచేత న్యాయమైనట్టిగాని ( శాస్త్రీయమైనట్టిగాని ) , అన్యాయమైనట్టి ( అశాస్త్రీయమైనట్టి ) గాని ఏకర్మమును ప్రారంభించుచున్నాడో దాని కీ యైదున్ను కారణములై యున్నవి . కర్మవిషయమందిట్లుండగా ( పైన దెల్పిన అయిదున్ను కారణములై యుండగా ) ఎవడు సంస్కరింపబడని బుద్ధిగలవాడగుటచే , నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో , అట్టి అవివేకి కర్మముయొక్కగాని , ఆత్మయొక్కగాని వాస్తవస్వరూపమును ఎఱుఁగకున్నాడు .
17

ఎవనికి ' నేను కర్తను ' అను తలంపు లేదో , ఎవనియొక్క బుద్ధి విషయములను , కర్మలను అంటదో అతడీ ప్రాణులన్నిటిని చంపినను వాస్తవముగ ఏమియు చంపుట లేదు . మఱియు నతడు ( కర్మలచే , పాపముచే ) బంధింపబడుటయు లేదు .
18

కర్మమునకు హేతువు తెలివి , తెలియదగిన వస్తువు , తెలియువాడు అని మూడు విధములుగ నున్నది . అట్లే కర్మకాధారమున్ను, ఉపకరణము ( సాధనము ) , క్రియ , చేయువాడు - అని మూడువిధములుగ నున్నది .
19
గుణములనుగూర్చి విచారణచేయు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము , కర్మము , కర్త అనునివియు సత్త్వాదిగుణములయొక్క భేదముననుసరించి మూడువిధములుగనే చెప్పబడుచున్నవి . వానినిగూడ ( శాస్త్రోక్త ప్రకారము ) చెప్పెదను వినుము .
20

విభజింపబడి వేఱువేఱుగనున్న సమస్త చరాచర ప్రాణులందును , ఒక్కటైన నాశరహితమగు ఆత్మవస్తువును ( దైవముయొక్క ఉనికిని ) విభజింపబడక ( ఏకముగ నున్నట్లు ) ఏ జ్ఞానముచేత నెఱుఁగుచున్నాడో అట్టి జ్ఞానము తాత్త్వికమని తెలిసికొనుము .
21

ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్త ప్రాణులందును వేఱు వేఱువిధములుగనున్న అనేక జీవులను వేఱు వేఱుగా నెఱుఁగుచున్నాడో , అట్టి జ్ఞానమును రాజస జ్ఞానమని తెలిసికొనుము .
22
ఏ జ్ఞానము వలన మనుజుడు ఏ దేని ఒక్క పనియందు ( శరీర , ప్రతిమాదులందు ) సమస్తమును అదియే యని తగిలియుండునో , అందులకు తగిన హేతువు లేకుండునో , తత్త్వమును ( సత్యవస్తువును ) తెలియకనుండునో , అల్పమైనదిగ ( అల్ప ఫలము గలిగినదిగ ) యుండునో , అట్టి జ్ఞానము తామసజ్ఞానమని చెప్పబడినది .
23

శాస్త్రముచే నియమింపబడినదియు , ఫలాపేక్షగాని , ఆసక్తి ( సంగము ), అభిమానముగాని , రాగద్వేషములుగాని లేకుండ చేయబడునదియు సాత్త్వికకర్మమనఁబడును .
24

ఫలాపేక్షగలవానిచేతగాని , మఱియు అహంకారముతో గూడినవానిచేగాని అధిక ప్రయాసకరమగు కర్మ మేది చేయబడుచున్నదో , అది రాజసకర్మయని చెప్పబడినది .
25

తాను చేయు కర్మకు మున్ముందు కలుగబోవు దుఃఖాదులను ( ధనాదుల ) నాశమును , ( తనయొక్క , ఇతరులయొక్క శరీరాదులకుగల్గు ) బాధను , తన సామర్థ్యమును ఆలోచింపక , అవివేకముతో ప్రారంభింపబడు కర్మము తామసకర్మయని చెప్పబడుచున్నది .
26

సంగమును ( ఆసక్తిని ) , ఫలాపేక్షను విడచినవాడును , ' నేను కర్తన ' ను అభిమానము , అహంభావము లేనివాడును , ధైర్యముతోను , ఉత్సాహముతోను గూడియున్నవాడును , కార్యము సిద్ధించినను , సిద్ధింపకున్నను వికారమును జెందనివాడునునగు కర్త సాత్త్విక కర్త యని చెప్పబడును .
27

అనురాగము ( బంధ్వాదులం దభిమానము ) గలవాడును , కర్మఫలము నాశించువాడును , లోభియు , హింసాస్వభావము కలవాడును , శుచిత్వము లేని వాడును , (కార్యము సిద్ధించినపుడు ) సంతోషముతోను , ( చెడినపుడు ) దుఃఖముతోను గూడియుండువాడునగు కర్త రాజసకర్త యని చెప్పబడును .
28

మనోనిగ్రహము ( లేక చిత్తైకాగ్రత ) లేనివాడును , పామరస్వభావము గలవాడును ( అవివేకము ) , వినయము లేనివాడును , మోసగాడును , ఇతరులను వంచించి వారి జీవనములను పాడుచేయువాడును , సోమరితనముగలవాడును , ఎల్లప్పుడు దిగులుతో నుండువాడును , స్వల్పకాలములో చేయవలసినదానిని దీర్ఘకాలమునకైనను పూర్తిచేయనివాడును నగు కర్త తామసకర్త యని చెప్పబడుచున్నాడు .
29

ఓ అర్జునా ! బుద్ధియొక్కయు , ధైర్యముయొక్కయు భేదమును గుణములనుబట్టి మూడు విధములుగా వేఱ్వేఱుగను , సంపూర్ణముగను చెప్పబడుచున్నవానిని ( నీ విపుడు ) వినుము .
30

ఓ అర్జునా ! ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని ( లేక ప్రవృత్తిమార్గమగు కర్మమార్గమును ) , అధర్మమునుండి నివృత్తిని ( లేక నివృత్తిమార్గమగు సన్న్యాసమార్గమును ) , చేయదగుదానిని , చేయదగనిదానిని , భయమును , అభయమును , బంధమును మోక్షమును తెలుసుకొనుచున్నదో అట్టిబుద్ధి సాత్త్వికమైనది యగును .
31

ఓ అర్జునా ! ఏ బుద్ధిచేత మనుజుడు ధర్మమును , అధర్మమును చేయదగినదానిని , చేయరానిదానిని , ఉన్నదియున్నట్లుగాక ( మఱియొక విధముగ , పొరపాటుగ ) తెలిసికొనుచున్నాడో ఆ బుద్ధి రాజసబుద్ధియై యున్నది .
32

ఓ అర్జునా ! ఏ బుద్ధి అవివేకముచేత కప్పబడినదై అధర్మమును ధర్మమనియెంచునో , మఱియు సమస్తపదార్థములను విరుద్ధములుగా తలంచునో , అట్టి బుద్ధి తామస బుద్ధియై యున్నది .
33

ఓ అర్జునా ! చలింపని ( విషయములందు ప్రవర్తింపని ) ఏ ధైర్యముతో గూడినవాడై మనసుయొక్కయు , ప్రాణముయొక్కయు , ఇంద్రియములయొక్కయు క్రియలను యోగసాధనచేత ( విషయములనుండి త్రిప్పి ఆత్మధ్యానమున , లేక శాస్త్రోక్తమార్గమున ) నిలువబెట్టుచున్నాడో , అట్టి ధైర్యము సాత్త్వికమైనది .
34

ఓ అర్జునా ! ఏ ధైర్యముచేత మనుజుడు ఫలాపేక్ష గలవాడై ధర్మమును , అర్థమును , కామమును మిగుల యాసక్తితో అనుష్ఠించుచుండునో , అట్టి ధైర్యము రాజసమై యున్నది .
35

ఓ అర్జునా ! ఏబుద్ధిచేత దుర్బుద్ధియగు మనుజుడు నిద్రను , భయమును , దుఃఖమును , సంతాపమును (దిగులును ) , మదమును విడువకయుండునో , అట్టి ధైర్యము తామసమై యున్నది .
36

భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! దేనియొక్క అభ్యాసముచే మనుజుడు ఆనందము నొందుచుండునో , దుఃఖశాంతినిగూడ లెస్సగ బడయుచుండునో , అట్టి సుఖ మిపుడు మూడు విధములుగా నాచే తెలియబడుచున్నది .వినుము --
37

ఏ సుఖము ప్రారంభమునందు విషమువలెను , పర్యవసానమందు అమృతమును బోలినదిగను నుండునో , తన బుద్ధియొక్క నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్త్వికమని చెప్పబడినది.
38

ఏ సుఖము విషయేంద్రియసంబంధమువలన మొదట అమృతమును బోలియు , పర్యవసానమందు ( అనుభవానంతరమున ) విషమువలె నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని చెప్పబడినది .
39

నిద్ర , సోమరితనము , ప్రమత్తత - అనువానివలన బుట్టినదై , ఏ సుఖము ఆరంభమందును , అంతమందును ( అనుభవించిన మీదటను ) తనకు మోహమును
( అజ్ఞానమును , భ్రమను ) గలుగజేయుచున్నదో అది తామససుఖమని చెప్పబడినది .
40

ప్రకృతి ( మాయ ) నుండి పుట్టినవగు ఈ మూడుగుణములతో గూడియుండని వస్తు వీ భూలోకమునగాని , స్వర్గమందుగాని , దేవతలయందుగాని , ఎచటను లేదు
41

శత్రువులను తపింపజేయు ఓ అర్జునా ! బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్రులకు వారివారి ( జన్మాంతర సంస్కారము ననుసరించిన ) స్వభావము ( ప్రకృతి ) వలన పుట్టిన గుణములనుబట్టి కర్మలు వేఱు వేఱుగ విభజింపబడినవి .
42

అంతరింద్రియ నిగ్రహము ( మనోనిగ్రహము ) , బాహ్యేంద్రియ నిగ్రహము , తపస్సు , శుచిత్వము , ఋజుమార్గవర్తనము , శాస్త్రజ్ఞానము , అనుభవజ్ఞానము , దైవమందు గురువునందు , శాస్త్రమందు నమ్మకము గలిగియుండుట స్వభావమువలన పుట్టిన బ్రాఙ్మణకర్మయై యున్నది .
43

శూరత్వము , తేజస్సు , కీర్తి , ప్రతాపము , ధైర్యము , సామర్థ్యము , యుద్ధమునందు పాఱిపోకుండుట , దానము ( ధర్మపూర్వక ) , ప్రజాపరిపాలనాశక్తి , ( శాసకత్వము ) - ఇయ్యవి స్వభావమువలన పుట్టిన క్షత్రియధర్మమై యున్నది .
44

వ్యవసాయము , గోసంరక్షణము , వర్తకము వైశ్యునకు స్వభావజనితములగు కర్మలై యున్నవి . అట్లే సేవారూపమైన కర్మము శూద్రులకు స్వభావసిద్ధమై యున్నది .
45

తన తన స్వాభావిక కర్మమునం దాసక్తి ( శ్రద్ధ ) గల మనుజుడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని బొందుచున్నాడు . స్వకీయకర్మయం దాసక్తిగలవాడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని యెట్లు పడయగల్గునో దానిని చెప్పెదను వినుము .
46

ఎవనివలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము ( ప్రవృత్తి ) కలుగుచున్నదో , ఎవనిచేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడియున్నదో , అతనిని ( అట్టి పరమాత్మను ) , మనుజుడు స్వకీయ కర్మముచే నారాధించి జ్ఞానయోగ్యతారూపసిద్ధిని పొందుచున్నాడు .
47

తనయొక్క ధర్మము ( తన అవివేకముచే ) గుణము లేనిదిగ కనబడినను ( లేక , అసంపూర్ణముగ అనుష్ఠింపబడినను ) చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మముకంటె ( లేక , ఇతర ధర్మములకంటె ) శ్రేష్ఠమైనదే యగును . స్వభావముచే ఏర్పడిన ( తన ధర్మమునకు తగిన ) కర్మమును చేయుచున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు .
48

ఓ అర్జునా ! స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమైనను ( దృశ్య రూపమైనను , లేక , త్రిగుణాత్మకమైనను ) దానిని వదలరాదు . పొగచేత అగ్ని కప్పబడునట్లు సమస్తకర్మములును ( త్రిగుణములయొక్క ) దోషముచేత కప్పబడియున్నవి కదా.
49

సమస్త విషయములందును తగులుబాటునొందని ( అసక్తమగు ) బుద్ధిగలవాడును , మనస్సును జయించినవాడును , కోరికలు లేనివాడు నగు మనుజుడు సంగత్యాగముచే ( జ్ఞానమార్గముచే ) సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మస్థితిని బొందుచున్నాడు .
50

ఓ అర్జునా ! కర్మసిద్ధిని ( నిష్కామకర్మలచే చిత్తశుద్ధిని ) బడసినవాడు పరమాత్మ నేప్రకారముగ పొందగలడో ఆ విధమును మఱియు జ్ఞానముయొక్క శ్రేష్ఠమైననిష్ఠ ( లేక పర్యవసానము ) ఏది కలదో దానినిన్ని ( జ్ఞాననిష్ఠను , లేక జ్ఞాన పరాకాష్ఠను ) సంక్షేపముగ నావలన దెలిసికొనుము .
51 & 52 & 53

అతినిర్మలమైన బుద్దితో గూడినవాడును , ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడును , శబ్దస్పర్శాదివిషయములను విడిచిపెట్టువాడును , రాగద్వేషములను పరిత్యజించువాడును , ఏకాంతస్థలములందు నివసించువాడును , మితాహారమును సేవించువాడును , వాక్కును , శరీరమును , మనస్సును స్వాధీనము చేసికొనినవాడును , ఎల్లప్పుడును ధ్యానయోగతత్పరుడై యుండువాడును , వైరాగ్యమును లెస్సగ నవలంబించినవాడును , అహంకారమును, బలమును , ( కామక్రోధాది సంయుక్తమగు బలమును లేక మొండిపట్టును ) , డంబమును , కామమును ( విషయాసక్తిని ) , క్రోధమును , వస్తు సంగ్రహణమును , బాగుగా వదలివైచువాడును , మమకారము లేనివాడును , శాంతుడును అయియుండువాడు బ్రహ్మస్వరూపము నొందుటకు ( బ్రహ్మైక్యమునకు , మోక్షమునకు ) సమర్థుడగుచున్నాడు .
54

బ్రహ్మరూపమును (బ్రహ్మైక్యమును ) బొందినవాడు ( జీవన్ముక్తుడు ) , నిర్మలమైన ( ప్రశాంతమైన ) మనస్సుగలవాడు నగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు . దేనిని కోరడు . సమస్త ప్రాణులందును సమబుద్ధిగలవాడై ( వానిని తనవలనే చూచుకొనుచు ) నాయందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు .
55

భక్తి చేత మనుజుడు ' నేనెంతటివాడనో , ఎట్టివాడనో ' యథార్థముగ తెలిసికొనుచున్నాడు . ఈ ప్రకారముగ నన్ను గూర్చి వాస్తవముగా నెఱిఁగి అనంతరము నాయందు ప్రవేశించుచున్నాడు .
56

సమస్త కర్మములను ఎల్లప్పుడును చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు ( శరణుబొందువాడు ) నా యనుగ్రహము వలన నాశరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు .
57

సమస్త కర్మములను ( కర్మఫలములను ) వివేకయుక్తమగు బుద్ధిచేత నాయందు సమర్పించి , నన్నే పరమప్రాప్యముగ నెంచినవాడవై చిత్తైకాగ్రతతోగూడిన తత్త్వవిచారణను ( లేక ధ్యానయోగమును ) అవలంబించి ఎల్లప్పుడు నాయందే చిత్తమును నిల్పుము .
58

నాయందు చిత్తమును జేర్చినవాడవైతివేని నా యనుగ్రహమువలన సమస్త సాంసారిక దుఃఖములను దాటగలవు అట్లుగాక అహంకారమువలన నా యీ వాక్యములను వినకుందువేని చెడిపోదువు .


అ.
యదహంకారమాశ్రిత్య
న యోత్స్య ఇతి మన్యసే|||

ఒకవేళ అహంకారము నవలంబించి ' నేను యుద్ధము చేయను ' అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదియే అగును.

59 & 60

( ఏలయనిన ) నీ ( క్షత్రియ ) స్వభావమే నిన్ను ( యుద్ధమున ) నియోగింపగలదు . ఓ అర్జునా ! స్వభావము ( పూర్వజన్మ సంస్కారము ) చే గలిగిన ( ప్రకృతిసిద్ధమైన ) నీయొక్క కర్మముచే లెస్సగ బంధింపబడినవాడవై దేనిని చేయుటకు అవివేకమున నిచ్చగించకున్నావో దానిని పరాధీనుడవై ( కర్మాధీనుడవై ) తప్పక చేసియే తీరుదువు .
61

ఓ అర్జునా ! జగన్నియామకుడు పరమేశ్వరుడు ( అంతర్యామి ) మాయచేత సమస్తప్రాణులను యంత్రము నారోహించినవారినివలె ( కీలుబొమ్మలనువలె ) త్రిప్పుచు సమస్త ప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు .
62

ఓ అర్జునా ! సర్వవిధముల ఆ ( హృదయస్థుడగు ) ఈశ్వరునే శరణుబొందుము . ఆతని యనుగ్రహముచే సర్వోత్తమమగు శాంతిని , శాశ్వతమగు మోక్షపదవిని నీవు పొందగలవు .
63

ఈ విధముగ రహస్యము లన్నిటికంటెను పరమరహస్యమైనట్టి జ్ఞానమును ( గీతాశాస్త్రము ) నేను నీకు జెప్పితిని . దీనినంతను బాగుగ విచారణచేసి తదుపరి నీ కెట్లిష్టమో అట్లాచరింపుము .
64

ఓ అర్జునా ! రహస్యములన్నిటిలోను పరమరహస్యమైనదియు , శ్రేష్ఠమైనదియునగు నా వాక్యమును మఱల వినుము . ( ఏలయనిన ) నీవు నాకు మిక్కిలి ఇష్టుడవు . ఇక్కారణమున నీ యొక్క హితమును గోరి మఱల చెప్పుచున్నాను .
65

నాయందు మనస్సునుంచుము , నా యెడల భక్తి కలిగియుండుము , నన్నారాధింపుము , నాకు నమస్కరింపుము . అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు . నీవు నాకిష్టుడవైయున్నావు . కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను .
66

సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కనిమాత్రము శరణుబొందుము . నేను సమస్త పాపములనుండియు నిన్ను విముక్తునిగ జేసెదను .
67

నీకు బోధింపబడిన ఈ గీతాశాస్త్రమును తపస్సు లేనివానికిగాని , భక్తుడు కానివానికిగాని , వినుట కిష్టము లేనివానికిగాని ( లేక గురుసేవచేయనివానికిగాని ) , నన్ను దూషించువానికిగాని ( లేక , నా యెడల అసూయజెందువానికిగాని ) ఎన్నడును చెప్పదగినది కాదు .
68

ఎవడు అతిరహస్యమైన గీతాశాస్త్రమును నా భక్తులుకు చెప్పునో అట్టివాడు నాయందుత్తమ భక్తి గలవాడై , సంశయరహితుడై ( లేక , నిస్సందేహముగ ) నన్నే పొందగలడు .
69

మనుజులలో అట్టివానికంటె నాకు మిక్కిలి ప్రియము నొనర్చువాడెవడును లేడు . మఱియు నాకు మిక్కిలి ఇష్టుడైనవాడు ఈ భూలోకమున మఱియొకడు కలుగబోడు .
70

ఎవడు ధర్మయుక్తమైన ( లేక , ధర్మస్వరూపమేయగు ) మన యిరువురి ఈ సంభాషణమును అధ్యయనము చేయునో అట్టివానిచే జ్ఞానయజ్ఞముచేత నేనారాధింపబడినవాడ నగుదునని నా నిశ్చయము .
71

ఏ మనుజుడు శ్రద్ధతో కూడినవాడును , అసూయ లేనివాడునునై ఈ గీతాశాస్త్రమును వినునో , అట్టివాడును పాపవిముక్తుడై పుణ్యకార్యములను చేసినవారియొక్క పుణ్యలోకములను పొందును .
72

ఓ అర్జునా ! నా యీ బోధను నీవు ఏకాగ్రమనస్సుతో వింటివా ? అజ్ఞానజనితమగు నీయొక్క భ్రమ ( దానిచే ) సంపూర్ణముగా నశించినదా ?
73

అర్జునుడు చెప్పెను .
ఓ శ్రీ కృష్ణా ! నీయనుగ్రహమువలన నాయజ్ఞానము నశించినది . జ్ఞానము ( ఆత్మస్మృతి ) కలిగినది . సంశయములు తొలగినవి . ఇక నీ యాజ్ఞను నెరవేర్చెదను .

74
సంజయుడు చెప్పెను .
ఓ ధృతరాష్ట్రమహారాజా ! ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణునియొక్కయు , మహాత్ముడగు అర్జునునియొక్కయు ఆశ్చర్యకరమైనట్టియు , పులకాంకురమును కలుగజేయునదియు నగు ఈ సంభాషణమును వింటిని .

75
శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహమువలన , నేను అతిరహస్యమైనదియు , మిగుల శ్రేష్ఠమైనదియు నగు ఈ యోగశాస్త్రమును స్వయముగనే అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడగు శ్రీకృష్ణునివలన ప్రత్యక్షముగా ( నేరుగా ) వింటిని .
76 & 77

ఓ ధృతరాష్ట్రమహారాజా ! ఆశ్చర్యకరమైదియు , పావనమైనదియు , ( లేక పుణ్యదాయకమైనదియు ) నగు కృష్ణార్జునులయొక్క ఈ సంభాషణమును తలంచి తలంచి మాటిమాటికి ఆనందమును బొందుచున్నాను --ఓ ధృతరాష్ట్రమహారాజా ! శ్రీకృష్ణమూర్తియొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును తలంచి తలంచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది . మఱియు ( దానిని తలంచుకొని ) మాటిమాటికిని సంతోషమును బొందుచున్నాను .
78

ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను , ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు , విజయమున్ను , ఐశ్వర్యమున్ను , దృఢమగు నీతియు ఉండునని నా యభిప్రాయము .


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
మోక్షసంన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః|| 18 ||


ఇది శ్రీ వేదవ్యాసముని విరచితమైనదియు , నూఱువేల శ్లోకములు

గలదియును , ఛందోబద్ధమైనదియునగు శ్రీ మహాభారతమున భీష్మపర్వమునగల ఉపనిషత్ప్రతిపాదకమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును , శ్రీకృష్ణార్జున సంవాదమును నగు శ్రీ భగవద్గీతలందు మోక్షసన్న్యాసయోగమను పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము.

No comments:

Post a Comment