August 30, 2017

అథ సప్తదశోऽధ్యాయః -1 నుండి 10 వరకు శ్లోకాలు

అథ సప్తదశోऽధ్యాయః - శ్రద్ధాత్రయవిభాగయోగః 1 నుండి 10 వరకు శ్లోకాలు 
1 వ శ్లోకం 
అర్జున ఉవాచ|
యే శాస్త్రవిధి ముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః|
తేషాం నిష్ఠా తు కా ? కృష్ణ సత్త్వమాహో రజస్తమః||

అర్జునుడు అడిగెను
ఓ కృష్ణా ! ఎవరు శాస్త్రోక్త విధానమును విడిచిపెట్టి, శ్రద్ధతో కూడుకొని పూజాదులను చేస్తారో, వారియొక్క స్థితి సాత్త్వికమా , లేక రాజసమా , లేక తామసమా ? ఏదియై ఉన్నదో నాకు తెలుపుము. 

2 వ శ్లోకం 
శ్రీభగవానువాచ|
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా|
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు||

శ్రీ కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. 
అందరికీ శ్రద్ధ 3 విధములు. అది స్వభావము వలన పుట్టును. స్వభావమనగా   ప్రాణులయొక్క స్వభావముచే (పూర్వజన్మ సంస్కారముచే) కలిగిన ఆ శ్రద్ధ సాత్త్వికమనియు రాజసమనియు, తామసమనియు మూడు విధములుగా అగుచున్నది . దానిని గూర్చి వినుము . 

3 వ శ్లోకం 
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత|
శ్రద్ధామయోऽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః||

ఓ అర్జునా ! సమస్త జీవులకును వారి వారి ( పూర్వజన్మ సంస్కారముతో గూడిన ) యంతఃకరణము ననుసరించి శ్రద్ధ ( గుణము, సంస్కారము ) కలుగుచున్నది . ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగ కలిగియున్నాడు . ఎవడెట్టి శ్రద్ధ గలిగియుండునో అతడట్టి శ్రద్ధయే పొందుచున్నాడు . ( అట్టి శ్రద్ధనే గ్రహించును ) తద్రూపుడే అయి యుండునని భావము .

4 వ శ్లోకం 
యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః|
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః||

సత్త్వగుణముగలవారు - దేవతలను, రజోగుణము గలవారు - యక్షులను, రాక్షసులను, తమోగుణముగలవారు - భూత ప్రేత గణములను పూజించుచున్నారు.

5 & 6 వ శ్లోకాలు  
అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః|
దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః||

కర్షయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః|
మాం చైవాన్తఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్||

ఏ జనులు శరీరమందుననున్నట్టి పంచభూతసముదాయమును లేక ఇంద్రియ సమూహమును (ఉపవాసాదులచే) శుష్కింపజేయువారును, శరీరమందంతర్యామిగనున్న నన్నును కష్టపెట్టువారును, దంభాహంకారములతో కూడినవారును, కామము, రాగము, (ఆసక్తి), పశుబలము కలవారును (లేక కామబలము, రాగబలము గలవారును) అవివేకులును అయి శాస్త్రమునందు విధింపబడనిదియు, తమకును ఇతరులకును కూడ బాధాకరమైనదియునగు తపస్సును జేయుచున్నారో, అట్టివారిని అసుర స్వభావము గలవారినిగ తెలిసికొనుము .

7 వ శ్లోకం 
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః|
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు||

ఆహారముకూడ సర్వులకును (సత్త్వాది గుణములనుబట్టి ) మూడు విధములుగ ఇష్టమగుచున్నది. అలాగుననే యజ్ఞము, తపస్సు, దానము కూడ జనులకు మూడు విధములుగ ప్రియమై యుండుచున్నది. ఆ ఆహారాదుల ఈ భేదమునుగూర్చి (చెప్పెదను) వినుము.

8 వ శ్లోకం 
ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః|
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః||

ఆయుష్షును, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగుగ వృద్ధినొందించునవియు, రసము కలవియు, చమురుకలవియు, దేహమందు చాలా కాలముండునవియు, మనోహరములైనవియునగు ఆహారములు సత్త్వగుణము కలవారికి ఇష్టములై యుండును.

9 వ శ్లోకం 
కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః|
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః||

చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, మిగుల దాహము కలుగజేయునవిగాను ఉండునవియు, (శరీరమునకు) దుఃఖమును, (మనస్సునకు) వ్యాకులత్వమును కలుగజేయునవియునగు ఆహారపదార్థములు రజోగుణముగలవానికి ఇష్టములై యుండును. 

10 వ శ్లోకం 
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్|
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్||

వండిన పిమ్మట ఒక జాము దాటినదియు (లేక బాగుగ ఉడకనిదియు), సారము నశించినదియు, దుర్ఘంధము గలదియు, పాచిపోయినదియు, (వండిన పిదప ఒక రాత్రి గడచినదియు), ఒకరు తినగా మిగిలినది (ఎంగిలి చేసినదియు), అశుద్ధముగా నున్నదియు(భగవంతునకు నివేదింపబడనిదియు) అగు ఆహారము తమోగుణము గలవారి కిష్టమైనది యగును.




No comments:

Post a Comment