January 21, 2014

భగవద్గీత అథ పఞ్చదశోऽధ్యాయః - పురుషోత్తమయోగః 11 నుండి 20 శ్లోకాలు

భగవద్గీత అథ పఞ్చదశోऽధ్యాయః - పురుషోత్తమయోగః 11 నుండి 20 శ్లోకాలు 

యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|
యతన్తోऽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః||
భావం 
అంతః కరణశుద్ధిగలయోగులు తమహృదయముల యందున్న ఈ ఆత్మతత్త్వమును ప్రయత్నించి తెలిసికొనగలరు. కాని అంతఃకరణశుద్ధిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొనజాలరు.

12వ శ్లోకం
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేऽఖిలమ్|
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్|| 
భావం 
సర్వజగత్తును ప్రకాశింపజేయు సూర్యునితేజస్సును, అటులనే చంద్రునితేజస్సును, అగ్నితేజస్సును నాతేజస్సేయని తెలిసికొనుము. 

13వ శ్లోకం
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా|
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః|| 
భావం 
భూమియందు ప్రవేశించి, నేను నా శక్తిద్వారా సకల భూతములను ధరించి, పోషించుచున్నాను. రసస్వరూపుడనై - అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషదులకు అనగా వనస్పతులన్నింటికిని, పుష్టిని చేకూర్చుచున్నాను.

14వ శ్లోకం
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| 
భావం 
నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.

15వ శ్లోకం
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనఞ్చ|
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్|| 
భావం 
అన్ని ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నానుండియే స్మృతి, జ్ఞానము, మరపు కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను గూడ నేనే.

16వ శ్లోకం
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ|
క్షరః సర్వాణి భూతాని కూటస్థోऽక్షర ఉచ్యతే|| 
భావం 
ఈ లోకమునందు క్షరుడు (నశ్వరుడు ), అక్షరుడు (వినాశనము లేనివాడు) అని పురుషులు రెండు విధముగా గలరు. సకల ప్రాణులశరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు.

17వ శ్లోకం
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుధాహృతః|
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః|| 
భావం
పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరైనవాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ.అతడు మూడులోకములయందును ప్రవేశించి, అందరిని భరించి పోషించుచున్నాడు. 

18వ శ్లోకం
యస్మాత్క్షరమతీతోऽహమక్షరాదపి చోత్తమః|
అతోऽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః|| 
భావం
నశ్వరమగు క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కెతిని.  

19వ శ్లోకం
యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్|
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత|| 
భావం 
ఓ అర్జునా ! జ్ఞానియైనవాడు ఈ విధముగా నన్ను తత్త్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును.

20వ శ్లోకం
ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ|
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత|| 
భావం 
ఓ పుణ్యపురుషా ! ఓ అర్జునా ! అత్యంతము రహస్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్త్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞానియై కృతార్థుడు కాగలడు. 

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
పురుషోత్తమయోగో నామ పఞ్చదశోऽధ్యాయః|| 



2 comments:

  1. భగవధ్గీత అధ్యాయాలలో పదిహేను అధ్యాయాల వరకే ఉన్నాయి,పదహారు నుండి పద్దెనిమిది వరకు లేవు. పెట్టగలరు.

    ReplyDelete