April 5, 2016

అథ సప్తదశోऽధ్యాయః -11 నుండి 28 వరకు శ్లోకాలు

అథ సప్తదశోऽధ్యాయః - శ్రద్ధాత్రయవిభాగయోగః 11 నుండి 28 వరకు శ్లోకాలు 


11

అఫలాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే|
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః||

'ఇది చేదగినదియే' అని మనస్సును సమాధానపరచి శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్ష లేనివారి చేత చేయబడుచున్నదో అది సాత్త్వక యజ్ఞ మనబడును.


12

అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్|
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్||

భరతవంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఫలమును కోరియు, డంబము కొరకును గావింపబడు యజ్ఞమును రాజసమైన దానినిగా నీవు తెలిసికొనుము.


13

విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్|
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే||

విధ్యుక్తము కానిదియు, అన్నదానము లేనిదియు, మంత్ర రహితమైనదియు, దక్షిణ లేనిదియు, శ్రద్ధ బొత్తిగ లేనిదియునగు యజ్ఞము తామసయజ్ఞమని చెప్పబడును.


14

దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్|
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే||

దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను(మహాత్ములను బ్రహ్మజ్ఞానముగలపెద్దలను) పూజించుట బాహ్యాభ్యంతరశుద్ధి కలిగియుండుట, ఋజుత్వముతో గూడియుండుట(కుటిలత్వము లేకుండుట, మనోవాక్కాయములతో ఏకరీతిగ వర్తించుట)బ్రహ్మచర్యవ్రతమును పాలించుట, ఏప్రాణిని హింసింపకుండుట, శారీరక (శరీర సంబంధమైన) తపస్సని చెప్పబడుచున్నది.


15

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే||

ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు గలిగించునదియు అగు వాక్యమును, వేదాదులయొక్క అధ్యయనమును అభ్యసించుట, (వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత భాగవత రామాయణాదులు మున్నగు వానిని అధ్యయనము చేయుట, ప్రణవాది మంత్రములను జపించుట) వాచిక తపస్సని చెప్పబడుచున్నది.


16

మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః|
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే||

మనస్సును నిర్మలముగా నుంచుట (కలత నొందనీయక స్వచ్ఛముగా నుంచుట), ముఖప్రసన్నత్వము (కౄరభావము లేకుండుట), పరమాత్మను గూర్చిన మననము (దైవధ్యానము) గలిగియుండుట {లేక, దృశ్యసంకల్పము లెవ్వియు లేక ఆత్మయందే స్థితిగలిగియుండుట అను (వాఙ్మౌనసహిత) మనోమౌనము}, మనస్సును బాగుగ నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము గలిగియుండుట (మోసము మున్నగునవి లేకుండుట) అను ఇవి మానసిక తపస్సని చెప్పబడుచున్నది.


17

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః|
అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే||

ఫలాపేక్ష లేనివారును, నిశ్చలచిత్తులును, (లేక, దైవభావనాయుక్తులును) అగు మనుషులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ (పైన దెలిపిన శారీరక, వాచిక, మానసికములను) మూడు విధములైన తపస్సును సాత్త్వికమని (సాత్త్వికతపస్సని) (పెద్దలు) చెప్పుదురు.


18

సత్కారమానపూజార్థం తపో దమ్భేన చైవ యత్|
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్||

ఇతరులచే తాను సత్కరింపబడవలెనని, గౌరవింపబడవలెనని, పూజింపబడవలెనని డంబముతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై, అనిశ్చితమైనట్టి ఫలము కలదై (లేక చపలమైనట్టి రూపముకలదై) ఈ ప్రపంచమున రాజస తపస్సు అని చెప్పబడినది. 


19

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః|
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్||

మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును (శుష్కోపవాసాదులచే) బాధించుకొనుటద్వారాగాని, లేక ఇతరులను నాశనము చేయవలెనను ఉద్దేశ్యముతో గాని చేయబడు తపస్సు తామసిక తపస్సని చెప్పబడినది.


20

దాతవ్యమితి యద్దానం దీయతేऽనుపకారిణే|
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్||

ఈయవలసినదేయను నిశ్చయముతో ఏ దానము పుణ్యప్రదేశమందును, యోగ్యుడగువానికి మరియు ప్రత్యుపకారము చేయ శక్తి లేని వాని కొరకు ఈయబడుచున్నదో అది సాత్త్విక దానమని చెప్పబడుచున్నది.


21

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః|
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్||

ప్రత్యుపకారము కొరకుగాని, లేక ఫలము నుద్దేశించిగాని, లేక మనఃక్లేశముతో (అతికష్టముతో) గాని ఈయబడు దానము రాజస దానమని చెప్పబడుచున్నది.


22

అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే|
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్||

దానమునకు తగని (అపవిత్రములగు) దేశకాలములందును, పాత్రులు (అర్హులు)కానివాని కొరకును, సత్కారశూన్యముగను, అమర్యాదతోను ఈయబడిన దానము తామస దానమని చెప్పబడుచున్నది.


23

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః|
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా||

పరబ్రహ్మమునకు 'ఓమ్' అనియు, 'తత్' అనియు, 'సత్' అనియు మూడువిధములగు పేర్లు చెప్పబడినవి. ఈ నామ త్రయమువలననే (దాని ఉచ్ఛారణచేతనే) పూర్వము బ్రాహ్మణులు (బ్రహ్మజ్ఞానులు), వేదములు, యజ్ఞములు, నిర్మింపబడినవి.

24

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః|
ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్||

అందువలన, వేదములను బాగుగ నెఱిఁగినవారియొక్క శాస్త్రోక్తములగు యజ్ఞ, దాన, తపః క్రియలన్నియు ఎల్లప్పుడును 'ఓమ్' అని చెప్పిన పిమ్మటనే అనుష్ఠింపబడుచున్నవి.


25

తదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః|
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః||

అట్లే 'తత్' అను పదమును ఉచ్చరించియే ముముక్షువులు ఫలాపేక్ష లేక పలువిధములైన యజ్ఞ, దాన, తపః కర్మలను చేయుచున్నారు.


26 

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే|
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే||

27

యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే|
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే||

ఓ అర్జునా ! 'కలదు' అనెడి అర్థమందును, 'మంచిది' అనెడి అర్థమందును 'సత్' అను పరబ్రహ్మ నామము ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మమునందును ఆ 'సత్' అను పదము వాడబడుచున్నది. యజ్ఞమునందును, తపస్సునందును, దానమునందుకల నిష్ఠ (ఉనికి) కూడ 'సత్' అని చెప్పబడుచున్నది.


28

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్|
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ||

ఓ అర్జునా ! అశ్రద్ధతో చేయబడిన హోమముగాని, దానముగాని, తపస్సుగాని, ఇతర కర్మలుకాని 'అసత్తని' చెప్పబడును. అవి ఇహలోక ఫలమును (సుఖమును) గాని, పరలోక ఫలమును (సుఖమును) గాని కలుగజేయవు.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే


శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః||

ఇది ఉపనిషత్ప్రతిపాదితమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రద్ధాత్రయ విభాగ యోగమను పదిహేడవ అధ్యాయము. 
ఓమ్ తత్ సత్.

No comments:

Post a Comment