January 21, 2014

భగవద్గీత అథ పఞ్చదశోऽధ్యాయః - పురుషోత్తమయోగః 1 నుండి 10 శ్లోకాలు

భగవద్గీత అథ పఞ్చదశోऽధ్యాయః - పురుషోత్తమయోగః 1 నుండి 10 శ్లోకాలు

శ్రీభగవానువాచ|
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్|| 
భావం 

శ్రీకృష్ణభగవానుడు పలికెను - ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా, వేదములే ఆకులుగా గల ఈ సంసారరూప - అశ్వత్థవృక్షము శాశ్వతమైనది. ఈ సంసారవృక్షతత్త్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను తెలిసినవాడు. 

2 వ శ్లోకం 
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః|
అధశ్చ మూలాన్యనుసన్తతాని కర్మానుబన్ధీని మనుష్యలోకే|| 
భావం 
ఈ సంసారవృక్షమును త్రిగుణములనెడి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధిపొందు శాఖలే దేవమనుష్యతిర్యోగ్యనులలో జన్మించు ప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖముల, చిగుళ్ళు  సర్వత్ర వ్యాపించి యున్నవి.మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలనెడి వేర్లు, ఊడలు అన్నిలోకములలోను క్రింద, పైన వ్యాపించి ఉన్నవి.

3వ శ్లోకం
న రూపమస్యేహ తథోపలభ్యతే నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా|
అశ్వత్థమేనం సువిరూఢమూలం అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా|| 
భావం 
ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము గాదు. ఇది ఆదియు, అంతము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారమమ కారవాసనారూపములైన దృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసారరూప - అశ్వత్థవృక్షమును సునిశితమైన విరాగ్యమనెడి శస్త్రముతో ఖండించి..

4వ శ్లోకం
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్గతా న నివర్తన్తి భూయః|
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే| యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ|| 
భావం 
అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఈ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు మరలరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ సనాతనమైన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది. అట్టి పరమాత్ముని శరణుపొంది, దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని సదా మనన, నిదిధ్యాసాదులు చేయవలెను.

5వ శ్లోకం
నిర్మానమోహా జితసఙ్గదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః|
ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్- గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్|| 
భావం 
దురాభిమానమును, మోహమును వదిలిపెట్టినవారు, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రాపంచికవాంఛలవదిలినవారు పరమాత్మ స్వరూపము నందు నిత్యము చలించువారు, సుఖదుఃఖాదిద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. 

6వ శ్లోకం
న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః|
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ|| 
భావం 
స్వయంప్రకాశస్వరూపమైన ఆ పరమాత్మను సూర్యుడు గాని, చంద్రుడుగాని, అగ్నిగాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు. 

7వ శ్లోకం
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః|
మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి||
భావం 
ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతియందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తనవైపు ఆకర్షించును. 

8వ శ్లోకం
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః|
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్|| 
భావం 
వాయువు వాసనలను ఒకచోటినుండి మఱియొకచోటికి తీసికొని పోయినట్లుగా దేహాడులకు స్వామియైన జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సును ఇంద్రియములను గ్రహించి, వాటితో గూడ మరొక శరీరమును పొందును. 

9వ శ్లోకం
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ|
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే|| 
భావం
ఈ జీవాత్మ పంచేంద్రియములను, మనస్సును ఆశ్రయించి, శబ్దాది విషయములను అనుభవించును. 

10వ శ్లోకం
ఉత్క్రామన్తం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్|
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః|| 
భావం
జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును, శరీరమునందు స్థితుడై యున్నప్పుడును, విషయభోగములను అనుభవించు చున్నప్పుడును, త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికోనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రములవలన స్వస్వరూపమును తెలిసికొనుచున్నారు.  



No comments:

Post a Comment