January 20, 2014

భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయః - గుణత్రయవిభాగయోగః 1 నుండి 10 శ్లోకాలు

భగవద్గీత అథః చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః 1 నుండి 10 శ్లోకాలు 

శ్రీభగవానువాచ|
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ ! 
యద్ జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్దిమితో గతాః !! 
భావం 
శ్రీ భగవానుడు పలికెను - జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరల తెల్పుచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలిసికొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. 

2 వ శ్లోకం 
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః|
సర్గేऽపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ|| 
భావం 
ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్టి కాలమందు మరల జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు.

3 వ శ్లోకం 
మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్|
సమ్భవః సర్వభూతానాం తతో భవతి భారత|| 
భావం 
ఓ అర్జునా ! నా మహద్బ్రహ్మరూపమైన మూలప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతనసముదాయ రూపమైన బీజమును ఉంచెదను. దాని వలననే సర్వభూతముల ఉత్పత్తి కలుగుచున్నది.

4 వ శ్లోకం 
సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః|
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా|| 
 భావం
ఓ అర్జునా ! నానా యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపనచేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి. నేను తండ్రిని.

5 వ శ్లోకం 
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమ్భవాః|
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్|| 
భావం
ఓ అర్జునా ! ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్త్వరజస్తమోగుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించుచున్నది.

6 వ శ్లోకం 
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్|
సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ|| 
భావం 
ఓ పాపరహితుడా ! ఈ మూడింటిలో సత్త్వగుణము నిర్మలమైనది. కనుక ప్రకాశకమైనది. వికారరహితమైనది. కాని అది సుఖనందలి ఆసక్తి చేత, జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించుచున్నది. 

7 వ శ్లోకం 
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్|
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్|| 
భావం
అర్జునా ! రజోగుణము రాగాత్మకము. అది కామము, ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని యెరుంగము. అది జీవాత్మను కర్మలయొక్కయు, కర్మఫలముల యొక్కయు ఆసక్తిని కల్పించి జీవుని బంధించును. 

8 వ శ్లోకం 
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్|
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత|| 
భావం
అర్జునా ! తమోగుణము సకలదేహాభిమానులను మోహితులనుగా చేయును. అజ్ఞానము వలన జనించును. అది జీవుని బంధించి వేయుచున్నది.

9 వ శ్లోకం 
సత్త్వం సుఖే సఞ్జయతి రజః కర్మణి భారత|
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సఞ్జయత్యుత|| 
భావం 
ఓ అర్జునా ! సత్త్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును. తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచును.

10 వ శ్లోకం 
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత|
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా|| 
భావం
 ఓ అర్జునా ! రజస్తమోగుణములననచి సత్త్వగుణము వృద్ధిచెందును. సత్త్వతమోగుణములనణచి రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్త్వరజో గుణములనణచి తమోగుణము వృద్ధియగుచుండును. 


No comments:

Post a Comment