January 19, 2014

భగవద్గీత -- అథ ద్వాదశో‌உధ్యాయః -- భక్తియోగో నామః --- 11 నుండి 20 వరకు శ్లోకాలు

భగవద్గీత -- అథ ద్వాదశో‌உధ్యాయః -- భక్తియోగో నామః --- 11 నుండి 20 వరకు శ్లోకాలు


అథైతదప్యశక్తో‌உసి కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||
భావం 
మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు ఆశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని, కర్మఫలాసక్తిని వదిలి కర్మలనాచరింపుము. 

12 వ శ్లోకం 
శ్రేయో హి ఙ్ఞానమభ్యాసాజ్ఙ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరమ్ || 
భావం 
తత్త్వము నేరుంగకయే చేయు అభ్యాసముకంటెను జ్ఞానము శ్రేష్ఠము. కేవలము పరోక్షజ్ఞానముకంటెను అనగా అనుభవ రహితమైన జ్ఞానము కంటెను (శాస్త్ర పాండిత్యము కంటెను) పరమేశ్వర స్వరూపధ్యానము శ్రేష్ఠము. ధ్యానము కంటెను కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్ఠమైనది. ఏలనన త్యాగమువలన వెంటనే పరమశాంతి లభిస్తుంది. 

13  వ శ్లోకం 
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ||
భావం
ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణుల యందును అవ్యాజమైనప్రేమ, కరుణ కలవాడును, మమత అహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను, దుఃఖము ప్రాప్తించినను, సమభావము కలిగియుండు వాడును, క్షమాగుణము కలవాడును  

14  వ శ్లోకం 
సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః |
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః || 
భావం 
సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడై యుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశము నందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును, అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ఇష్టుడు.

15  వ శ్లోకం 
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః |
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః ||
భావం 
లోకమున ఎవరికిని ఉద్వేగము కలిగింపనివాడును, ఎవరివలనను తాను ఉద్వేగమునకు గురికానివాడును, హర్షము, ఈర్ష్య, భయము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు.

16  వ శ్లోకం 
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః |
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ||
భావం 

ఏ మాత్రమూ కాంక్షలేనివాడును, శరీరేంద్రియమనస్సుల యందు శుచియై యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్తకర్మలయందును కర్తృ త్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. 

17  వ శ్లోకం 
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః ||
భావం 
ఇష్టవస్తుప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికినీ శోకింపనివాడును, దేనినీ ఆశింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించిన వాడును, ఐన భక్తుడు నాకు ఇష్టుడు. 

18  వ శ్లోకం 
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః |
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః || 
భావం
శత్రువులయెడను, మిత్రులయెడను సమభావముతో మెలుగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును...

19  వ శ్లోకం 
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ |
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః || 
భావం 
నిందాస్తుతులకు చలింపనివాడును, మననశీలుడును, శరీరనిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడు వాడును, గృహాదుల యందు మమతాసక్తులు లేనివాడును, స్థిరబుద్ధి కలిగియుండు భక్తుడెవ్వడో వాడు నా కిష్టుడు.

20  వ శ్లోకం 
యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తే‌உతీవ మే ప్రియాః ||
భావం 
శ్రద్ధావంతులై, నన్నేపరమగతిగాభావించి, ఇంతవరకు నే తెలిపిన ఈ ధర్మస్వరూపమైన అమృతమును ఎవరు సేవిస్తున్నారో వారు నాకు అత్యంత ప్రియులు. 


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే 
భక్తియోగో నామ ద్వాదశో‌உధ్యాయః 

No comments:

Post a Comment