October 15, 2013

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః 31 నుండి 40 వరకు శ్లోకాలు:--

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః  31 నుండి 40 వరకు శ్లోకాలు:--

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమో‌உస్తు తే దేవవర ప్రసీద |
విఙ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ || 
భావం:--
ఓ పరమాత్మా ! నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన, నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను.      
32 వ శ్లోకం:--  
శ్రీభగవానువాచ |
కాలో‌உస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః |
ఋతే‌உపి త్వాం న భవిష్యంతి సర్వే యే‌உవస్థితాః ప్రత్యనీకేషు యోధాః || 
భావం:--
శ్రీ భగవానుడు పలికెను--- నేను లోకములన్నిటిని తుదముట్టించుటకై విజ్రుంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధముచేయకున్నను
ప్రతిపక్షమునున్న ఈ వీరులెవ్వరును మిగులరు.(మిగిలియుండరు).  
33 వ శ్లోకం:--  
తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ |
మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ || 
భావం:--
కనుక, ఓ సవ్యసాచీ ! లెమ్ము కీర్తిగాంచుము. శతృవులను జయించి సర్వసంపదలతో తులతూగురాజ్యమును అనుభవింపుము. వీరందరును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము.      
34 వ శ్లోకం:--  
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ || 
భావం:--
ఇదివరకే నాచేత చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రధ (సైంధవ) కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శతృవులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము.       
35 వ శ్లోకం:--  
సంజయ ఉవాచ |
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య || 
భావం:--
సంజయుడు పలికెను -- ఓ రాజా ! శ్రీ కృష్ణపరమాత్మ యొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణుకుచు, చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను.      
36 వ శ్లోకం:--  
అర్జున ఉవాచ |
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః || 
భావం:--
అర్జునుడు పలికెను-- ఓ అంతర్యామి !కేశవా ! నీనామాగునా ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపొవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైనరాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగుణములవారికెల్లరును ప్రణమిల్లుచున్నారు.      
37 వ శ్లోకం:--  
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్గరీయసే బ్రహ్మణో‌உప్యాదికర్త్రే |
అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ || 
భావం:--
ఓ మహాత్మా ! నీవు సర్వశ్రేష్టుడవు, సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక వారు (సిద్ధాదు లందరును) నీకు నమస్కరింపక ఎట్లుండగలరు ? ఓ అనంతా ! ఓ దేవేశా ! ఓ జగన్నివాసా ! నత్ - అ న త్ లు నీవే. వాటికంటెనుపరమైన అక్షరస్వరూపుడవు అనగా, సచ్చిదానంద ఘనపరబ్రహ్మవు నీవే.       
38 వ శ్లోకం:--  
త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప || 
భావం:--
ఓ అనంతరూపా ! నీవు ఆదిదేవుడవు. సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు, ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమైయున్నది.        
39  వ శ్లోకం:--  
వాయుర్యమో‌உగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తే‌உస్తు సహస్రకృత్వః పునశ్చ భూయో‌உపి నమో నమస్తే ||
భావం:--
నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతియైన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు. మరలమరల నమస్కారములు. ఇంకను నమస్కారములు.           
40 వ శ్లోకం:--  
నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమో‌உస్తు తే సర్వత ఏవ సర్వ |
అనంతవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతో‌உసి సర్వః || 
భావం:--
అనంతసామర్ధ్యముగలవాడా ! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా ! నీకు అన్నివైపులనుండియు నమస్కారములు. ఏలనన అనంతపరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములును నీవియే.       

No comments:

Post a Comment