October 15, 2013

భగవద్గీత--అథదశమో‌உధ్యాయః---విభూతియోగః 21 నుండి 30 వరకు శ్లోకాలు

భగవద్గీత--అథదశమో‌உధ్యాయః---విభూతియోగః  21 నుండి 30 వరకు శ్లోకాలు

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ || 

భావం:--
అదితియొక్క ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలలోని తేజమును నేను. తారలయందు చంద్రుడను నేను.


22 వ శ్లోకం:--

వేదానాం సామవేదో‌உస్మి దేవానామస్మి వాసవః |
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ||


భావం:--
వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేనే. ఇంద్రియములలో నేను మనస్సును. ప్రాణులలో చైతన్యమును నేనై యున్నాను.


23 వ శ్లోకం:--

రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ ||

భావం:--
ఏకాదశరుద్రులలో శంకరుడు నేను. యక్షరాక్షసులలో ధనాధిపతియైన కుబేరుడను నేను. అష్టవసువులలో అగ్నిని నేను. పర్వతములలో సుమేరు పర్వతమునై యున్నాను.

24 వ శ్లోకం:--

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః ||

భావం:--
పార్థా ! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సముద్రుడను.


25 వ శ్లోకం:--

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యఙ్ఞానాం జపయఙ్ఞో‌உస్మి స్థావరాణాం హిమాలయః ||


భావం:--
మహర్షులలో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. యజ్ఞములయందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేనైయున్నాను.


26 వ శ్లోకం:--

అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |

గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః || 

భావం:--
వృక్షములలో నేను అశ్వత్థమును (రావిచెట్టును) దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుదను. సిద్దులలో నేను కపిలమునిని.


27 వ శ్లోకం:--

ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ||


భావం:--
అశ్వములలో పాలసముద్రమునుండి అమృతముతో పుట్టిన ఉచ్చైఃశ్రమును నేను, భద్రగజములలో ఐరావతమును నేను, మనుష్యులలో ప్రభువును నేను.

28 వ శ్లోకం:--

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ||


భావం:--
ఆయుధములలో వజ్రాయుధమును నేను. పాడిఆవులలో కామదేనువును నేను. శాస్త్రవిహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను. సర్పములలో వాసుకిని నేను.


29 వ శ్లోకం:--

అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితూణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ||


భావం:--
నాగజాతివారిలో ఆదిశేషుడను నేను, జలచరములకు అధిపతియైన వరుణుడను నేను, పితరులలో అర్యముడను(పితృగణప్రభువును)నేను, శాసకులలో యమధర్మరాజుని నేను.


30 వ శ్లోకం:--

ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ |
మృగాణాం చ మృగేంద్రో‌உహం వైనతేయశ్చ పక్షిణామ్ ||


భావం:--
దైత్యులలో నేను ప్రహ్లాదుడను, గణించువారిలో (గణకులలో) నేను కాలమును, మృగములలో మృగరాజు అయిన సింహమును నేను, పక్షులలో పక్షిరాజైన గరుక్మంతుడను నేనే. 



No comments:

Post a Comment