October 15, 2013

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః 12 నుండి 20 వరకు శ్లోకాలు:--

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః  12 నుండి 30 వరకు శ్లోకాలు:--

12 వ శ్లోకం 
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |
యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః || 
భావం:--
ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించవచ్చు, కాంతి పుంజములును ఆ విరాట్ రూపతేజస్సులకు సాటిరావు. 
13 వ శ్లోకం 
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా || 
భావం:--
ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవునిశరీరమునందు అసంఖ్యాకములైన వివిధబ్రహ్మాండములు వేర్వేరుగా ఒకేచోట కేంద్రీకృతమై యున్నట్లు చూచెను. 
14 వ శ్లోకం 
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః |
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత || 
భావం:--
అద్భుతమైన ఆ పరమాత్మని విశ్వరూపమును జూచి , అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వ (విరాట్) రూపమునకు భక్తిశ్రద్ధలతో సాష్టాంగప్రణామములాచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. 
15 వ శ్లోకం 
అర్జున ఉవాచ |
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ |
బ్రహ్మాణమీశం కమలాసనస్థమృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ || 
భావం:--
అర్జునుడు పలికెను --- ఓ దేవాదిదేవా !నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను , దివ్యసర్పములను చూచుచున్నాను.
16 వ శ్లోకం 
అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో‌உనంతరూపమ్ |
నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప || 
భావం:--
ఓ విశ్వేశ్వరా ! విశ్వరూపా ! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యంతములను తెలిసికొనలేకున్నాను.         
17 వ శ్లోకం 
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ |
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ ||
భావం:--
హే విష్ణో ! కిరీటమును, గదను, చక్రమును, ధరించి అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యొతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది.   
18 వ శ్లోకం 
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే || 
భావం:--
పరమ -- అక్షరస్వరూపుడైన పరబ్రహ్మపరమాత్మవు నీవే. కనుక, అందరికిని తెలిసికొనదగినవాడవు. ఈ జగత్తునునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అనన్యవుడవు. సనాతన పురుషుడవు. అని నా విశ్వాసము.         
19 వ శ్లోకం 
అనాదిమధ్యాంతమనంతవీర్యమనంతబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్ || 
భావం:--
నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అపరమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె నీ ముఖముప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమొనర్చు చున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను.        
20 వ శ్లోకం 
ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ || 
భావం:--
ఓ మహాత్మా ! దివినుండి భువివరకుగల అంతరిక్షమునందు అంతటను అన్ని దిశలనునీవే పరిపూర్ణుడవై యున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి , ముల్లోకలములు గడగడలాడుచున్నవి.   

No comments:

Post a Comment