October 15, 2013

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః 01 నుండి 10 వరకు శ్లోకాలు:--

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --విశ్వరూపదర్శనయోగః 
01 నుండి 10 వరకు శ్లోకాలు:--


అర్జున ఉవాచ |
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంఙ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహో‌உయం విగతో మమ || 
భావం:--
అర్జునుడు పలికెను --- ఓ కృష్ణా ! నన్ను అనుగ్రహింపదలచిన పరమ గోప్యమైన ఆధ్యాత్మికవిషయములను ఉపదేశించితివి . దానివలన నా అజ్ఞానము (మోహము) తొలగిపోయినది. 
2 వ శ్లోకం:-- 
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ || 
భావం:-- 
ఓ కమలాక్షా ! ఓ కృష్ణా ! సమస్తప్రాణుల ఉత్పత్తి ప్రళయములనుగూర్చి సవిస్తరముగా వింటివి. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. 
3 వ శ్లోకం:-- 
ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర |
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ || 
భావం:--
ఓ పరమేశ్వరా ! నీవు చెప్పినదంతయు సత్యమే. అందు సందేహమునకు తావు లేదు. కాని ఓ పురుషోత్తమా ! జ్ఞాన, ఐశ్వర్య , శక్తి , బాల , వీర్య , తెజోమహితమైన నీ షడ్గుణఐశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. 
4 వ శ్లోకం:-- 
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ || 
భావం:--
ఓ యోగేశ్వరా ! ఓ ప్రభూ ! నీ దివ్యరూపమును చూచుటకున్నను అర్హునిగా నీవు భావించినచో, శాశ్వతమైన నీ దివ్యస్వరూపమును నాకు చూపించుము. 
5 వ శ్లోకం:-- 
శ్రీభగవానువాచ |
పశ్య మే పార్థ రూపాణి శతశో‌உథ సహస్రశః |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ || 
భావం:--
శ్రీకృష్ణ భగవానుడు పలికెను-----ఓ అర్జునా ! అసంఖ్యాకములైన బహువిధములైన, పెక్కువర్ణములు, ఆకృతులు గల నా అలౌకికరూపములను చూడుము.
6 వ శ్లోకం:-- 
పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా |
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత || 
భావం:-- 
ఓ అర్జునా ! ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశరుద్రులను, అశ్వినీకుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. అంతే గాక, ఇంకను మునుపెన్నడును చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము.     
7 వ శ్లోకం:-- 
ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి || 
భావం:-- 
ఓ అర్జునా ! నా ఈ రూపమునందు ఒకేచోట స్థితమైయున్న సమస్తచరాచర జగత్తును చూడుము. అంతేగాక ఇంకను నీవు చూడదలచుకొనిన వాటినన్నిటిని చూడుము.   
8 వ శ్లోకం:-- 
న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ || 
భావం:-- 
కాని ప్రాకృత(చర్మ) చక్షువులతో నా ఈ రూపమును నీవు నిజంగా (నిస్సందేహంగా)చూడజాలవు. కనుక నీకు దివ్య(అలౌకిక) దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్యదృష్టితో నా ఈ ఈశ్వరీయ (దివ్య) యోగశక్తిని చూడుము.   
9 వ శ్లోకం:-- 
సంజయ ఉవాచ |
ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ || 
భావం:-- 
సంజయుడు పలికెను --- ఓ రాజా ! మహాయోగేశ్వరుడును, పాపములను హరించువాడును ఐన భగవానుడు ఈ విధముగా పలికి, అనంతరము షడ్గుణఐశ్వర్య సంపన్నమైన తన పరమదివ్యస్వరూపమును అర్జునునకు చూపెను.      
10 & 11 వ శ్లోకాలు:-- 
అనేకవక్త్రనయనమనేకాద్భుతదర్శనమ్ |
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ||

దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ |

సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖమ్ ||
భావం:-- 
అర్జునుడు చూచినా ఆ పరమేశ్వరుని విరాట్(విశ్వ) రూపమునందలి ముఖములు అనంతములు.---- నేత్రములు అసంఖ్యాకములు. అందలి దృశ్యములు అద్భుతములైనవి. అ రూపము అనేక దివ్యాభరణశోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండును. దివ్యములగు మాలలను, వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్యశరీరము నుండి దివ్యచందన పరిమళములు దశదిశల గుబాలించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము.      

No comments:

Post a Comment