September 8, 2013

భగవద్గీత--అథ నవమో‌உధ్యాయః |--రాజవిద్యారాజగుహ్యయోగః 21 నుండి 30 వరకు శ్లోకాలు.

భగవద్గీత--అథ నవమో‌உధ్యాయః |--రాజవిద్యారాజగుహ్యయోగః 
21 నుండి 30 వరకు శ్లోకాలు.

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే || 

భావం:--
ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగానే) మరల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగ స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహితసకామకర్మలను ఆశ్రయించు వారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే తిరిగి మానవలోకమున జన్మించుచున్నారు.

22 వ శ్లోకం:--

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||

భావం:--
పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారియోగ క్షేమములను నేనే వహించుచుందును.


23 వ శ్లోకం:--

యే‌உప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |
తే‌உపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ||

భావం:--
ఓ అర్జునా ! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధి పూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి.

24 వ శ్లోకం:--

అహం హి సర్వయఙ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ||

భావం:--
ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎరుంగరు. కావున పతనమగు చున్నారు. (పునర్జన్మ పొందుచున్నారు).

25 వ శ్లోకం:--

యాంతి దేవవ్రతా దేవాన్పితూన్యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో‌உపి మామ్ ||

భావం:--
దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు.


26 వ శ్లోకం:-- 

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |

తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః || 

భావం:--
నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమును గాని, ఫలమును గాని జలమును గాని, నేను ప్రత్యక్షముగా ఆరగింతును.



27 వ శ్లోకం:--

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||

భావం:--
ఓ కౌంతేయా ! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించుదానమును, ఆచరించు తప్పస్సును నాకే సమర్పింపుము.

28 వ శ్లోకం:--

శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ||

భావం:--
ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై, అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మ బంధముల నుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే పొందగలవు.

29 వ శ్లోకం:--

సమో‌உహం సర్వభూతేషు న మే ద్వేష్యో‌உస్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ||

భావం:--
నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారి యందు ఉందును.


30 వ శ్లోకం:--

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ||

భావం:--
మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా అతడు సాధువే యని గ్రహింపుము.





No comments:

Post a Comment