September 5, 2013

భగవద్గీత--అథ నవమో‌உధ్యాయః--రాజవిద్యారాజగుహ్యయోగః 11 నుండి 20 వరకు శ్లోకాలు.

భగవద్గీత--అథ నవమో‌உధ్యాయః--రాజవిద్యారాజగుహ్యయోగః 
11 నుండి 20 వరకు శ్లోకాలు. 

అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ || 

భావం:--
నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను (ప్రభువును) ఐన నన్ను లోకకల్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి, నన్ను అలక్ష్యము చేయుచున్నారు
.

12 వ శ్లోకం:--

మోఘాశా మోఘకర్మాణో మోఘఙ్ఞానా విచేతసః |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ||

భావం:--
వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సుగల అజ్ఞానులు రాక్షసీ - ఆసురీ - మోహినీ స్వభావములను పొందుచున్నారు. 


13 వ శ్లోకం:--

మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః |
భజంత్యనన్యమనసో ఙ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ || 

భావం:-- 
కాని ఓ పార్థా! దైవీప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను (అక్షరస్వరూపినిగను) తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజించుచున్నారు.

14 వ శ్లోకం:--

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||

భావం:-- 
ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదేపదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను సేవించుచున్నారు.

15 వ శ్లోకం:--

ఙ్ఞానయఙ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ || 

భావం:-- 

మరికొందరు జ్ఞానులు నిర్గుణనిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించు చుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును ద్వైత భావముతో పూజించుచున్నారు.


16 వ శ్లోకం:--

అహం క్రతురహం యఙ్ఞః స్వధాహమహమౌషధమ్ |

మంత్రో‌உహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ || 

భావం:--
నేనే క్రతువును. నేనే యజ్ఞమును, పిండమును నేనే, ఔషధులును నేనే. నేనే మంత్రమును, నేనేహవిస్సును. నేనే అగ్నిని. హోమరూపకర్మమును నేనే అయియున్నాను.

17 వ శ్లోకం--

పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ ||

భావం:--

ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడనూ నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఋక్సామ యజుర్వేదములును నేనే.

18 వ శ్లోకం--

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ||

భావం:--

పరమగతియైన పరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే, అందరికిని నివాసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును ఆసింపక హితమొనర్చువాడను, అందరి ఉత్పత్తిప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, అవ్యయ బీజమును నేనే.

19 వ శ్లోకం--

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ||

భావం:--
ఓ అర్జునా ! సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి, వర్షరూపమున మరల వదలెదను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలమును) గూడ నేనే.

20 వ శ్లోకం--

త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యఙ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాందివి దేవభోగాన్ ||

భావం:--

ఋగ్యజుస్సామవేదములచే ప్రోక్తములైన సకామకర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫలరూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దివ్యములైన దేవతాభోగములను అనుభవించుచున్నారు.




No comments:

Post a Comment