September 10, 2013

భగవద్గీత--అథదశమో‌உధ్యాయః---విభూతియోగః 1 నుండి 10 శ్లోకాలు

భగవద్గీత--అథదశమో‌உధ్యాయః---విభూతియోగః
1 నుండి 10 శ్లోకాలు

శ్రీభగవానువాచ |
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |
యత్తే‌உహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ||

భావం:--
శ్రీ భగవానుడు పలికెను హేమహాబాహో ! నీవు నా మీద ప్రేమ గలవాడవు. కావున నీ మేలుగోరి నేను మరల చెప్పుచున్న వచనములను ఆలకింపుము.

2 వ శ్లోకం:--

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః |
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ||

భావం:--
నా ఉత్పత్తిని అనగా నా లీలావతారవిశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలిసికొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును, ఈ మహర్షులకును మూలకారణమైనవాడను నేనేగదా!

3 వ శ్లోకం:--

యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసంమూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ||

భావం:--
నన్ను యథార్థముగా జన్మరహితునిగను, అనాదియైన వానినిగను సకలలోక మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వపాపముల నుండియు విడివడుచున్నాడు.

4 & 5 వ శ్లోకాలు:--

బుద్ధిర్ఙ్ఞానమసంమోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవో‌உభావో భయం చాభయమేవ చ ||

అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో‌உయశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ||

భావం:--
నిశ్చయాత్మకశక్తి, యథార్థజ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖదుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయమ, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, అనునవి ప్రాణులకు నావలననే కలుగుచున్నవి.

6 వ శ్లోకం:--

మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ||

భావం:--
సప్తమహర్షులును, వారికంటెను పూర్వులైన సనకాది మహామునులు నలుగురును, స్వాయంభువాది చతుర్థశ మనువులును మొదలగు వీరందఱును నా భక్తులే. అందరూ నాయెడ సద్భావముగలవారే. వీరు నా సంకల్పమువలననే నా మానస పుత్రులై జన్మించిరి.


7 వ శ్లోకం:--

ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సో‌உవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ||


భావం:--
ఈ నా పరమేశ్వర్యరూపవిభూతిని, యోగశక్తి యొక్క తత్త్వమును తెలిసికొన్నవాడు నిశ్చలభక్తియుక్తుడగును. ఇందు ఏ మాత్రమూ సందేహము లేదు.


8 వ శ్లోకం:--

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ||


భావం:--
ఈ సమస్తజగత్తు యొక్క ఉత్పత్తికి నేనే మూలకారణము. నావలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తిశ్రద్దలతో నిరంతరము నన్నే సేవించుచున్నారు.


9 వ శ్లోకం:--

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ||

భావం:--
నా భక్తులు నా యందే తమ మనస్సులను లగ్నమొనర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకిత మొనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్త్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పికొనుచు, నిరంతరము సంతుష్టులగు చుందురు.

10 వ శ్లోకం:--

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ||


భావం:--
అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తిశ్రద్ధలతో నన్నే భజించువారికి నేను బుద్ధియోగమును అనగా తత్త్వజ్ఞాన రూపయోగమును అనుగ్రహించుచున్నాను.




No comments:

Post a Comment