September 2, 2013

భగవద్గీత---అథ అష్టమో‌உధ్యాయః--అక్షరబ్రహ్మయోగః 1 నుండి 10 శ్లోకాలు

భగవద్గీత---అథ అష్టమో‌உధ్యాయః--అక్షరబ్రహ్మయోగః  1 నుండి 10 శ్లోకాలు

అర్జున ఉవాచ |
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే || 

భావం:--
అర్జునుడు పలికెను - ఓ పురుషోత్తమా ! బ్రహ్మ అనగానేమి? అధ్యాత్మము అనగానేమి? కర్మ అనగానేమి? అధిభూతము అని దేనికి పేరు ? అధిదైవము అని దేనిని అందురు.

2 శ్లోకం:--
అధియఙ్ఞః కథం కో‌உత్ర దేహే‌உస్మిన్మధుసూదన |
ప్రయాణకాలే చ కథం ఙ్ఞేయో‌உసి నియతాత్మభిః ||

భావం:--
ఓ మధుసూదనా ! అధియజ్ఞము అనగానేమి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును నిగ్రహముచేసిన యోగులు నిన్నెట్లు తెలిసికొనగలరు ?


3 శ్లోకం:--
శ్రీభగవానువాచ |
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో‌உధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంఙ్ఞితః || 


భావం:-- 
శ్రీ భగవానుడు పలికెను బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, అధ్యాత్మము అనగా జీవాత్మ, పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమొనర్చి, వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాదికర్మలను కర్మమనబడుచున్నది.

4 శ్లోకం:-- 
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ |
అధియఙ్ఞో‌உహమేవాత్ర దేహే దేహభృతాం వర || 


భావం:-- 
ఓ అర్జునా ! ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము - దేహధారులలో శ్రేష్ఠుడవైన ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే - వాసుదేవుడనే అధియజ్ఞమును. 


5 శ్లోకం:-- 
అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్ |
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || 


భావం:-- 
అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును. ఇందేమాత్రము గూడ సంశయము వలదు.


6 వ శ్లోకం:--
యం యం వాపి స్మరన్భావం త్యజత్యంతే కలేవరమ్ |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః || 

భావం:--
కౌంతేయా ! మనుష్యుడు అవసానదశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయాస్వరూపములనే పొందుచున్నాడు.


7 శ్లోకం:--
తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయమ్ ||


భావం:--
కావున ఓ అర్జునా ! నీవు సర్వదా నన్నే స్మరించు చుండుము. యుద్ధమును కూడ చేయుము. నీ బుద్ధిని, మనస్సును నా యందే నిల్పియున్నచో నిజముగా నన్నే పొందెదవు.


8 శ్లోకం:--
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ || 

భావం:-- 
మనస్సునందు వేరే ధ్యాస ఏ మాత్రమూ లేకుండ నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూపయోగమునే సాధనచేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును.

9 శ్లోకం:--
కవిం పురాణమనుశాసితారమణోరణీయంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూపమాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 

భావం:-- 
సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరిని శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైనవాడును, సర్వ ప్రాణులను పోషించు వాడును, అచింత్య రూపుడును, సూర్యునివలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును ఐన పరమేశ్వరుని స్మరించు వాడగు....

10 శ్లోకం:--
ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్స తం పరం పురుషముపైతి దివ్యమ్ || 

భావం:-- 
అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భ్రుకుటీ మధ్యమున ప్రాణములను స్థిరముగా నిల్పి, నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యరూపుడును, పరమపురుషుడును ఐన పరమాత్మనే చేరును.




No comments:

Post a Comment