June 5, 2013

భగవద్గీత--అథ షష్ఠో‌உధ్యాయః 21 నుండి 30 శ్లోకాలు--ఆత్మసంయమయోగః......

భగవద్గీత--అథ షష్ఠో‌உధ్యాయః 21 నుండి 30 శ్లోకాలు--ఆత్మసంయమయోగః...... 

సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః || 

భావం:--
బ్రహ్మానందానుభము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏ మాత్రమూ చలింపడు.

22 వ శ్లోకం:--

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||


భావం:--
పరమాత్మాప్రాప్తిరూపలాభమును పొందినవాడు, ఏయితర లాభమును గూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖ ములును చలింపజేయజాలవు.


23 వ శ్లోకం:--

తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంఙ్ఞితమ్ |
స నిశ్చయేన యోక్తవ్యో యోగో‌உనిర్విణ్ణచేతసా || 


భావం:--
దుఃఖరూపసంసారబంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని (భగవత్సాక్షాత్కారరూపస్థితిని) యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన విసుగులేని చిత్తముతో నిశ్చయముగా అభ్యాసము చేయవలెను.


24 వ శ్లోకం:-- 

సంకల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః |
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః || 

భావం:--
సంకల్పముల వలన కలిగిన కోరికలనన్నింటిని నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగ మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను.


25 వ శ్లోకం:-- 

శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || 

భావం:--
క్రమక్రమముగా సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. దైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమొనర్చి, పరమాత్మనుతప్ప మరి ఏ ఇతర విషయమును ఏ మాత్రమూ చింతనచేయరాదు.


26 వ శ్లోకం:--

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ |

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ || 

భావం:--
సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించు చుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి, దానిని, పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలయును.


27 వ శ్లోకం:--

ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ||

భావం:-- 
ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందుచున్నాడు. 

28 వ శ్లోకం:--

యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః |
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే || 

భావం:-- 
పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తిరూపమైన అపరిమితమైన ఆనందమును హాయిగా అనుభవించును. 


29 వ శ్లోకం:--

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || 

భావం:-- 
సర్వవ్యాప్తమైన అనంతచైతన్యము నందు ఏకీభావస్థితిరూప యోగ యుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్థితమైయున్నట్లుగను, ప్రాణులన్నింటిని తన ఆత్మయందు కల్పితములుగను చూచును.

30 వ శ్లోకం:--

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || 

భావం:-- 
ఎవరు సమస్త ప్రాణులందు నన్ను చూచునో అట్టివానికి నేను కనబడకపోను. నాకతడు కనబడకపోడు. 



No comments:

Post a Comment