April 27, 2013

భగవద్గీత:--అథ ప్రథమో‌உధ్యాయః 31 నుండి 40 శ్లోకాలు....

భగవద్గీత:--అథ ప్రథమో‌உధ్యాయః 31 నుండి 40 శ్లోకాలు..

31 వ శ్లోకం:--
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయో‌உనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||

భావం:--ఓ కేశవా ! నాకు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజనసమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు.
32 వ శ్లోకం:-- 
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ||
భావం:--
ఓ కృష్ణా ! నాకు విజయము గాని, రాజ్యము గాని, సుఖములు గాని అక్కరలేదు. గోవిందా ! ఈ రాజ్యము వలన గాని, ఈ భోగములవలన గాని, ఈ జీవితమువలన గాని ప్రయోజనమేమి?

33 వ శ్లోకం:--
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమే‌உవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||

భావం:--
మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణములయెడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చియున్నారు.

34 వ శ్లోకం:--
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ||

భావం:--
గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు మొదలగువారు అందరూ ఇచ్చటికి చేరియున్నారు.

35 వ శ్లోకం:--
ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతో‌உపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||

భావం:--
ఓ మధుసూదనా ! ముల్లోకాధిపత్యముకొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండలవిషయమై చెప్పనేల ? అట్లే వీరిలో ఎవ్వరినైనను నన్ను చంపబూనిననూ నేను మాత్రము వీరిని చంపనే చంపను.

36 వ శ్లోకం:--
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ||

భావం:--
ఓ జనార్ధనా ! ఈ ధార్తరాష్ట్రులను చంపి, మనము బావుకొనునది ఏమి ?(మనము మూట కట్టుకొనునది ఏమి) ఈ ఆకతాయిలను చంపుటవలన మనకు పాపమే కలుగును.

37 వ శ్లోకం:--
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ||

భావం:--
కనుక ఓ మాధవా ! మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును ?

38 & 39 వ శ్లోకాలు....
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||

కథం న ఙ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||

భావం:--
లోభాకరణంగ భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్ధనా ! కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏల ఆలోచింపరాదు ?

40 వ శ్లోకం:--
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మో‌உభిభవత్యుత ||

భావం:--
కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నియును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును.



No comments:

Post a Comment