April 27, 2013

భగవద్గీత:--అథ ప్రథమో‌உధ్యాయః 22 నుండి 30 శ్లోకాలు....

భగవద్గీత:---అథ ప్రథమో‌உధ్యాయః--22 నుండి 30 శ్లోకాలు..(అర్జున విషాదయోగము)
యావదేతాన్నిరీక్షే‌உహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్రణసముద్యమే ||

భావం:--
రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్షయోధులందరినీ బాగుగా పరిశీలించునంతవరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంతవరకును రథమును నిలిపియుంచుము.

23 వ శ్లోకం:--
యోత్స్యమానానవేక్షే‌உహం య ఏతే‌உత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||
భావం:--
దుర్బుద్ధియైన దుర్యోధనునకు ప్రియమను గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరిని ఒకపరి పరికించెదను.

24 & 25 వ శ్లోకాలు:--
సంజయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||

భావం:--
సంజయుడు ఇలా పలికెను---ఓ ధృతరాష్ట్రా ! అర్జునుని కోరికమేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును, ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభాయసేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో "పార్థా ! ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము" అని పలికెను.
26 వ శ్లోకం:--
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితూనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతూన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ||
శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |

భావం:--
పిమ్మట పార్థుడు ఆ ఉభయసేనలయందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమావలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచెను.
(26,27 పూర్వార్థము)
27 శ్లోకం:--
తాన్సమీక్ష్య స కౌంతేయః సర్వాన్బంధూనవస్థితాన్ ||
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |

27-ఉత్తరార్థము, 28 పూర్వార్థము)
భావం:--
సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినిచూచి, కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణాసమంచితుడై శోకసంతుప్తుడై ఇట్లు పలికెను.

28 & 29 శ్లోకాలు:--
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||

భావం:--
అర్జునుడు పలికెను--- ఓ కృష్ణా ! సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును జూచి, నా అవయవములు శిథిలములగుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది. శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి.


30 వ శ్లోకం:--
గాండీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ||

భావం:--
గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము తపించిపోవుచున్నది. మనస్సు భ్రమకు గురియైనట్లు అనిపించుచున్నది. కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను.



No comments:

Post a Comment