May 1, 2013

భగవద్గీత:---అథ ద్వితీయో‌உధ్యాయః ....61 నుండి 72 శ్లోకాలు:--(సాంఖ్యా యోగః )

భగవద్గీత:---అథ ద్వితీయో‌உధ్యాయః ....61 నుండి 72 శ్లోకాలు:

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || 
భావం:--
ఎప్పుడూ కూడా సాధకుడు తన ఇంద్రియములను అన్నిటిని వశము నందుంచుకొని, సమాహితచిత్తుడై (చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసినవాడై) మత్పరాయణుడై , ధ్యానము నందు కుర్చొనవలెను. ఏలనన, ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుద్ధి స్థిరముగా నుండును

62 వ శ్లోకం:--
ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధో‌உభిజాయతే ||

భావం:--
విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును.


63 వ శ్లోకం:--
క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి ||

భావం:--
అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాపకశక్తి నశించును. బుద్ధి నాశనమువలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును.


64 వ శ్లోకం:--
రాగద్వేషవిముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ||

భావం:--
అంతఃకరణమును వసమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనః శాంతిని పొందును.


65 వ శ్లోకం:--
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ||

భావం:--
మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియు నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్నివిషయములనుండి వైదొలగి, పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును.


66 వ శ్లోకం:-
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్ || 

భావం:--
ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆసక్తిభావమే కలుగదు. తత్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనః శాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును ?



67 వ శ్లోకం:--
ఇంద్రియాణాం హి చరతాం యన్మనో‌உనువిధీయతే |
తదస్య హరతి ప్రఙ్ఞాం వాయుర్నావమివాంభసి ||

భావం:--
నీటిపై తేలుచున్న నావను గాలినెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను, ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును.


68 వ శ్లోకం:--
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||

భావం:--
కనుక ఓ అర్జునా ! ఇంద్రియములను ఇంద్రి యార్థముల నుండి అన్ని విధములుగ పూర్తిగా నిగ్రహించిన పురుషునియొక్క బుద్ధి స్థిరముగా నుండును.



69 వ శ్లోకం:--
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ||

భావం:--
నిత్యజ్ఞానస్వరూపపరమానందప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని యుండును. అది ఇతర ప్రాణులన్నింటికిని రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కొని యుండును. అది పరమాత్మతత్వమునెరిగిన మునికి (మనశీలునకు) రాత్రితో సమానము.


70 వ శ్లోకం:--
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |
తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ll

భావం:--
సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును, పరిపూర్ణమై నిశ్చలముగా నున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్తభోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు.



71 వ శ్లోకం :--
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ||

భావం:--
కోరికలన్నిటిని త్యజించి, మమతా- అహంకార, స్పృహా రహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును.


72 వ శ్లోకం:--
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామంతకాలే‌உపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ||

భావం:--ఓ అర్జునా ! బ్రాహ్మీస్థితి యనగా ఇదియే. (ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి) ఈ బ్రహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడును మొహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రహ్మీస్థితి యందు స్థిరముగా నున్నవాడు బ్రహ్మానందమును పొందును.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే...
సాంఖ్యయోగో నామ ద్వితీయో‌உధ్యాయః ||





No comments:

Post a Comment