May 1, 2013

భగవద్గీత:---అథ ద్వితీయో‌உధ్యాయః ....51 నుండి 60 శ్లోకాలు:--

భగవద్గీత:---అథ ద్వితీయో‌உధ్యాయః ....51 నుండి 60 శ్లోకాలు:-- 

51 వ శ్లోకం:-

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 

భావం:--
ఏలనన, సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధములయ్యెదరు. అంతేగాక, వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. 

52 వ శ్లోకం:--

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||


భావం:--
మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు.


53 వ శ్లోకం:--

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ||

భావం:--
నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన (అయోమయమునకు గురియైన) నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య (శాశ్వత) సంయోగము ఏర్పడును.


54 వ శ్లోకం:--
అర్జున ఉవాచ |
స్థితప్రఙ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ||


భావం:--
అర్జునుడు పలికెను--- ఓ కేశవా ! సమాధిస్థితుడై పరమాత్మప్రాప్తినొందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేవి ? అతడు ఎట్లు భాషించును ? ఎట్లు కూర్చొనును ? ఎట్లు నడుచును ?


55 వ శ్లోకం:--
శ్రీభగవానువాచ |
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రఙ్ఞస్తదోచ్యతే || |

భావం:--
శ్రీ భగవానుడు పలికెను----ఓ అర్జునా ! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా, ఆత్మయందు సంతుస్టుడైనవానిని, అనగా పరమాత్మ సంయోగమువలన ఆత్మఆనందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు.


56 వ శ్లోకం:-

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||

భావం:--
దుఃఖములకు కుంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని, క్రోధములను వీడినవాడును ఐనట్టి మనశీలుడు (ముని) స్థితప్రజ్ఞుడనబడును. 


57 వ శ్లోకం:--


యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||

భావం:--
దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితులయందు హర్షము. ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును.


58 వ శ్లోకం:--

యదా సంహరతే చాయం కూర్మో‌உంగానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||


భావం:--
తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియముల (విషయాదుల) నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించవలెను.


59 వ శ్లోకం:--

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసో‌உప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||


భావం:--
ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వానినుండి, ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కరమైనందు వలన వాని నుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును.


60 వ శ్లోకం:--

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ||


భావం:--
ఓ అర్జునా ! ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థములవైపు బలవంతముగా లాగుకొనిపోవుచునే యుండును.




No comments:

Post a Comment