May 1, 2013

భగవద్గీత:--అథ ద్వితీయో‌உధ్యాయః 41 నుండి 50 శ్లోకాలు....

భగవద్గీత:--అథ ద్వితీయో‌உధ్యాయః 41 నుండి 50 శ్లోకాలు....

41 వ శ్లోకం:-

వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో‌உవ్యవసాయినామ్ ||

భావం:--
ఓ అర్జునా ! ఈ (నిష్కామ) కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే యుండును. కాని, భొగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై, ఒకదారీ తెన్నూ లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా నుండును.     

42, 43 & 44 వ శ్లోకాలు:--

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః |
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ||

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే |
|

భావం:--
ఓ అర్జునా ! వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమునకలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యములయొక్క బాహ్యార్థములయందే ప్రీతివహింతురు. వాటి అంతరార్థముల జోలికేపోరు. స్వర్గమునకు మించినదేదియూ లేదనియు, అదియే పరమప్రాప్యమనియు, వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించును. ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో బడిన భొగైశ్వర్యాసక్తులైన అజ్ఞానులబుద్దులు భగవంతుడు లక్ష్యముగాగల సమాధియందు స్థిరముగా ఉండవు.


45 వ శ్లోకం:--

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||

భావం:--
ఓ అర్జునా ! వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగములయెడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతః కరణమును వశము నందుంచుకొనుము.


46 వ శ్లోకం:-

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః || 


భావం:--
అన్నివైపులా జలములతో నిండియున్న మహా జలాశయము అందుబాటులో నున్న వానికి చిన్నచిన్న జలాశయములవలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినొంది, పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి, వేదముల వలన అంతియే ప్రయోజనము. 


47 వ శ్లోకం:--
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగో‌உస్త్వకర్మణి ||


భావం:--
కర్తవ్యకర్మము నాచరించుటయందే నీకు అధికారము గలదు. ఎన్నటికినీ దాని ఫలములయందు లేదు. కర్మఫలములకు నీవు ఆసక్తుడవు కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడవు కావలడు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము.


48 వ శ్లోకం:--

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||


భావం:--
ఓ ధనుంజయా ! యొగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ధి -- అసిద్ధుల యెడ సమత్వ భావమును కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు.


49 వ శ్లోకం:--

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||


భావం:--
ఈ సమత్వబుద్ధియోగముకంటెను, సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. ఓ ధనుంజయా ! నీవు సమత్వబుద్ధియోగమునే ఆశ్రయింపుము. ఏలనన, ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంతదీనులు. కృపణులు.


50 వ శ్లోకం:--

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||

భావం:--
సమత్వ బుద్ధియుక్తుడైనవాడు పాపపుణ్యములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచారణము నందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము.




No comments:

Post a Comment