May 15, 2013

భగవద్గీత:---అథ తృతీయో‌உధ్యాయః..కర్మయోగః..21 నుడి 30 శ్లోకాలు...

భగవద్గీత:---అథ తృతీయో‌உధ్యాయః..కర్మయోగః..21 నుడి 30 శ్లోకాలు... 

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||

భావం:--
శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులును దానిని అనుసరింతురు. అనగా ఏ ప్రమాణము అతడు నిల్పినో ఇతరులు గ్రహింతురు.

22 వ శ్లోకం:--

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||


భావం:--
ఓ అర్జునా ! ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలను చేయుచునే ఉన్నాను.



23 వ శ్లోకం:--యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||



భావం:--ఓ పార్థా ! ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్పహాని వాటిల్లును. ఎందుకనగా మనుష్యులందరును సర్వ విధముల నా మార్గమునే అనుసరించుచున్నారు.

24 వ శ్లోకం:--

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ||


భావం:--
నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నియును నశించును. అంతేగాదు. లోకములందు అల్లకల్లోలములు ఏర్పడును. ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను.


25 వ శ్లోకం:--

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత |
కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్ ||


భావం:--
ఓ అర్జునా ! అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఫలాపేక్ష లేక కర్మలను చేయవలెను.


26 వ శ్లోకం:--

న బుద్ధిభేదం జనయేదఙ్ఞానాం కర్మసంగినామ్ |

జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ ||

భావం:--
పరమాత్మ స్వరూపము నందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకులోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తానుకూడ శాస్త్రవిహితములైన సమస్తకర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను.

27 వ శ్లోకం:--

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |

అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే || 

భావం:--
వాస్తవముగా కర్మలన్నియును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావింపుచుచున్నాడు.

28 వ శ్లోకం:--

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః |

గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే || 

భావం:--
ఓ మహాబాహో ! అర్జునా ! గుణవిభాగతత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి, వాటియందు ఆసక్తి నొందడు. 

29 వ శ్లోకం:--

ప్రకృతేర్గుణసంమూఢాః సజ్జంతే గుణకర్మసు |

తానకృత్స్నవిదో మందాన్కృత్స్నవిన్న విచాలయేత్ || 

భావం:--
ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి కర్మసంగులను అల్పజ్ఞులను, మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు గురిచేయరాదు.

30 వ శ్లోకం:--

మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా |
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః || 

భావం:--
సమస్త కర్మలు నా యందు సమర్పించి, ఆశగాని, మమకారము గాని లేనివాడవై నిర్భయముగా యుద్ధము చేయుము.



No comments:

Post a Comment