May 1, 2013

భగవద్గీత:--అథ ద్వితీయో‌உధ్యాయః 1 నుండి 10 శ్లోకాలు....

భగవద్గీత:---అథ ద్వితీయో‌உధ్యాయః ....1 వ శ్లోకం:-- 

సంజయ ఉవాచ |
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ||

భావం:--
సంజయుడు పలికెను--- ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అని అతని వ్యాకులపాటును, శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను. 

2 వ శ్లోకం:--

కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున ||

భావం:--
శ్రీభగవానుడుఇట్లనెను ఓ అర్జునా ! తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది ?ఇది శ్రేష్టులచే ఆచరింపబడునదియు కాదు, స్వర్గమును ఇచ్చునదియు కాదు. కీర్తిని కలిగించునదియు కాదు.


3 వ శ్లోకం:--

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||

భావం:--
కావున, ఓ అర్జునా ! పిరికితనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా ! తుచ్ఛమైన ఈ హృదయదౌర్భల్యమును వీడి, యుద్ధమునకై నడుము బిగింపుము.


4 వ శ్లోకం:-- 

అర్జున ఉవాచ |
కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||

భావం:--
అర్జునుడు పలికెను-- ఓ మధుసూదనా ! పూజ్యులైన భీష్మపితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను ? ఏలనన, ఓ అరిసూదనా ! ఈ ఇరువురును నాకు పూజ్యులు. 


5 వ శ్లోకం:--

గురూనహత్వా హి మహానుభావాన్శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్‌உరుధిరప్రదిగ్ధాన్ ||

భావం:--
మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకుని యైనను, ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన, ఈ గురుజనులను చంపినను, రక్తసిక్తములైన రాజ్యసంపదలను, భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి యుండునుగదా !


6 వ శ్లోకం:--

న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామస్తే‌உవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ||

భావం:--
ఈ యుద్ధముచేయుట శ్రేష్ఠమా ? లేక చేయ కుండుట శ్రేష్ఠమా ? అనునది ఎరుగను. యుద్ధమున వారిని మనము జయింతుమా ? లేక మనలను వారు జయింతురా ? అను విషయమునుగూడ ఎరుగను. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి(పోరాడుటకు) నిలిచియున్నారు. వారిని చంపి, జీవించుటకును మనము ఇష్టపడము.


7 వ శ్లోకం:--

కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసంమూఢచేతాః |
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే‌உహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||

భావం:--
కార్పణ్యదోషము(పిరికితనము)నకు లోనై, నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మములు విచక్షణకు దూరమై, నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము.



8 వ శ్లోకం:-

న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ |
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||

భావం:--
ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరిసంపదలతో గుడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారు ఉపాయమును గాంచలేకున్నాను.

 

9వ శ్లోకం:--
సంజయ ఉవాచ |
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప |
న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ ||


భావం:--
సంజయుడు పలికెను---ఓ రాజా ! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామియైన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు, "నేను యుద్ధము చేయనే చేయను" అని స్పష్టంగా తెలిపి మౌనం వహించెను.



10 వ శ్లోకం:--

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ||

భావం:--
ఓ ధృతరాష్ట్రా ! ఉభయసేనల మధ్య సంతుప్తుడైన అర్జునుని జూచి, శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను.





No comments:

Post a Comment