May 1, 2013

భగవద్గీత:--అథ ద్వితీయో‌உధ్యాయః 21 నుండి 30 శ్లోకాలు....

భగవద్గీత:--అథ ద్వితీయో‌உధ్యాయః 21 నుండి 30 శ్లోకాలు.... స్ధానుః స్థాణు 

21 వ శ్లోకం:-

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |

అథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 
భావం:--
ఓ పార్థా ! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జననమరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ? ఎవరిని ఎట్లు చంపును ?

22 వ శ్లోకం:--
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో‌உపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ ||

భావం:--
మానవుడు ఏవిధంగా జీర్ణ వస్త్రములు త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును.

23 వ శ్లోకం:--
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||

భావం:--
ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుప జాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు.


24 వ శ్లోకం:--
అచ్ఛేద్యో‌உయమదాహ్యో‌உయమక్లేద్యో‌உశోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలో‌உయం సనాతనః ||

భావం:--
ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము. సర్వవ్యాపి, చలింపనిది(అచలము), స్థాణువు (స్థిరమైనది), సనాతనము (శాశ్వతము).


25 వ శ్లోకం:--
అవ్యక్తో‌உయమచింత్యో‌உయమవికార్యో‌உయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||

భావం:--
ఈ ఆత్మ అవ్యక్తమైనది. (ఇంద్రియగోచరము కానిది) అచింత్యము, (మనస్సునకు అందనిది) వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జునా ! నీవు దీనికై శోకింపతగదు. 


26 వ శ్లోకం:-
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 

భావం:--
ఓ అర్జునా ! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ, నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు


27 వ శ్లోకం:--
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే‌உర్థే న త్వం శోచితుమర్హసి ||

భావం:--
ఏలనన, పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.


28 వ శ్లోకం:--

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||


భావం:--
ఓ అర్జునా ! ప్రాణులన్నియును పుట్టుటకుముందు ఇంద్రియగోచరములు కావు. (అవ్యక్తములు) మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జననమరణల మధ్యకాలమందు మాత్రమే అవి ప్రకటితములు. (ఇంద్రియ గోచరములు) అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.


29 వ శ్లోకం:--

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||

భావం:--
ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని(ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియు ఎరుగరు.


30 వ శ్లోకం:--

దేహీ నిత్యమవధ్యో‌உయం దేహే సర్వస్య భారత |
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||


భావం:--
ఓ అర్జునా ! ప్రతీ దేహమునందు ఉండెడి ఈ ఆత్మా వధించుటకు వీలుకానిది. కనుక, ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు.





No comments:

Post a Comment